కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీకి గుడ్‌న్యూస్

  • ఏపీకి కీలక రైల్వే ప్రాజెక్టు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ మౌలిక వసతుల అభివృద్ధి, రైల్వేలు, గ్రామీణ రహదారులు, సముద్ర బీమా, కేంద్ర ఉద్యోగుల డీఏ పెంపు వంటి పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.

ఏపీకి కీలక రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) రూ.24,815 కోట్ల వ్యయంతో రెండు కీలక మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ప్రాధాన్యమైన రాజమండ్రి (నిడదవోలు)–విశాఖపట్నం (దువ్వాడ) మూడో, నాలుగో రైల్వే లైన్ ప్రాజెక్టుతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్–సీతాపూర్ మూడో, నాలుగో రైల్వే లైన్ ప్రాజెక్టు కూడా ఉన్నాయి.

ఈ రెండు ప్రాజెక్టులు కలిపి ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లోని 15 జిల్లాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చనున్నాయి. అదనపు రైల్వే లైన్ల నిర్మాణంతో రైళ్ల రద్దీ తగ్గడంతో పాటు సరకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. ముఖ్యంగా నిడదవోలు–దువ్వాడ మార్గంలో మూడో, నాలుగో లైన్ల ఏర్పాటు వల్ల విశాఖపట్నం పోర్టు, కాకినాడ పోర్టులతో అనుసంధానం మరింత బలోపేతం కానుంది. దీంతో సరకు రవాణా వేగవంతం కావడంతో పాటు ప్రయాణికుల రైళ్ల నిర్వహణ కూడా మరింత సమర్థవంతంగా మారనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్‌కు ఆమోదం

దేశీయ సముద్ర బీమా వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ (BMIP) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ.12,980 కోట్ల సావరిన్ గ్యారంటీ ఇవ్వనుంది. ఈ పూల్ ద్వారా హల్ అండ్ మెషినరీ, కార్గో, ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ, వార్ రిస్క్ తదితర సముద్ర బీమా సేవలు దేశీయంగానే అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా భారత నౌకలు, సరకు రవాణాకు నిరంతర బీమా రక్షణ కల్పించడమే దీని లక్ష్యమని కేంద్రం తెలిపింది.

కేంద్ర ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా 2 శాతం డీఏ, డీఆర్ పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయంతో 50 లక్షలకుపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షలకుపైగా పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.6,791 కోట్ల అదనపు భారం పడనుంది.

పీఎంజీఎస్‌వై-3కు 2028 వరకు పొడిగింపు

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY-III)ను 2028 మార్చి వరకు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. గ్రామాలను వ్యవసాయ మార్కెట్లు, ఉన్నత పాఠశాలలు, ఆసుపత్రులతో అనుసంధానించే రహదారుల అభివృద్ధికి రూ.83,977 కోట్ల సవరించిన వ్యయాన్ని ఆమోదించింది. అదేవిధంగా మైదాన ప్రాంతాల్లో రహదారులు, వంతెనల నిర్మాణ పనుల గడువును 2028 మార్చి వరకు, కొండ ప్రాంతాల్లో వంతెనల నిర్మాణ గడువును 2029 మార్చి వరకు పొడిగించింది.

రైల్వేలు, రహదారులు, గ్రామీణ అనుసంధానం, సముద్ర బీమా వంటి రంగాల్లో తీసుకున్న తాజా నిర్ణయాలు దేశ ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమివ్వనున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా సరకు రవాణా వేగవంతం కావడం, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు, భారత నౌకాయాన రంగానికి దేశీయ బీమా రక్షణ, కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు వంటి నిర్ణయాలు విస్తృత ప్రయోజనాలు అందించనున్నాయని పేర్కొంది.

రూ.14,115 కోట్లకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..