తెలంగాణకు గర్వకారణం.. యువ బాక్సర్‌కు అభినందన ర్యాలీ

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన యువ బాక్సర్ ఎం.డి. అమ్రీన్ పంజాబ్‌లో నిర్వహించిన జాతీయ బాక్సింగ్ పోటీల్లో పతకం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం నుంచి పతకం సాధించిన ఏకైక క్రీడాకారిణిగా అమ్రీన్ గుర్తింపు పొందడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అమ్రీన్‌కు అభినందనలు తెలియజేస్తూ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎల్కతుర్తి బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ అభినందన ర్యాలీ నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు, యువకులు, సహ విద్యార్థులు తెలిపారు.

ఈ ర్యాలీలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, మహిళలు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్రీన్‌కు ఘన స్వాగతం పలికి సన్మానించనున్నారు. ఆమె తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించి తెలంగాణకు, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మునిగడప లావణ్య మాట్లాడుతూ, ఆడపిల్లలు కూడా క్రీడల్లో అత్యున్నత విజయాలు సాధించగలరని అమ్రీన్ నిరూపించిందని అన్నారు. ఆమె విజయం ఎల్కతుర్తి మండల యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.