రైతు భరోసాతో రైతులకు ఆర్థిక భరోసా

  • వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం
  • టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలజగ్గారెడ్డి
  • జిల్లాలో 62 రైతు వేదికల్లో ప్రత్యేక ఏర్పాట్లు: వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్

సంగారెడ్డి ప్రతినిధి,ఆంధ్రప్రభ: రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా–వానాకాలం 2026 పథకాన్ని ప్రారంభించిందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలజగ్గారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతు భరోసా–వానాకాలం 2026 పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, రైతులతో కలిసి రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు.

ఈ సందర్భంగా నిర్మలజగ్గారెడ్డి మాట్లాడుతూ తొలి విడతలో రెండు ఎకరాల వరకు భూమి కలిగిన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం నేరుగా జమ చేయడం ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో అర్హులైన రైతులందరికీ రైతు భరోసా కింద సుమారు రూ.9 వేల కోట్ల పెట్టుబడి సాయం అందజేయనున్నట్లు చెప్పారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వ్యవసాయ అవసరాలకు రైతులు సకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ పథకం ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.

రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించి వరితో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు, ఆయిల్‌పామ్ వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. అలాగే పంట అవశేషాలను కాల్చకుండా భూసారాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించే విధానాలను పాటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఉచిత విద్యుత్, సన్న వడ్లకు బోనస్ వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రస్థాయి కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా నుంచి 12 బస్సుల్లో సుమారు 600 మంది రైతులు హాజరుకాగా, జిల్లాలోని 62 రైతు వేదికల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి రైతులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. సంగారెడ్డి రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కె.వనిత, ఆత్మ చైర్మన్ వై.ప్రభు, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, మండల వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.