చెన్నూరులో పోలీసుల కార్డన్ సెర్చ్.. 52 వాహనాలు సీజ్
చెన్నూర్, ఆంధ్రప్రభ: కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా చెన్నూర్ పట్టణంలోని మహాకాళీవాడ (గోదావరి రోడ్)లో స్థానిక సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాలనీలో క్షుణ్ణంగా పరిశీలనలు చేపట్టి, సరైన పత్రాలు లేని, నంబర్ ప్లేట్ లేని 50 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశారు.
అదేవిధంగా ఒక కార్టన్ బీర్లు, 10 ఫుల్ బాటిళ్లు, 40 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఓ ఆటో డ్రైవర్, ఓ ద్విచక్ర వాహనదారుడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఐ బన్సీలాల్ కాలనీవాసులకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మాదకద్రవ్యాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించవద్దని హెచ్చరించారు. అలాగే గంజాయి సేవించి లేదా మద్యం మత్తులో రాత్రి వేళల్లో సంచరించే వారి సమాచారం పోలీసులకు అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ శ్యామ్ పటేల్, స్పెషల్ పోలీసు సిబ్బంది, చెన్నూర్ పట్టణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
