మద్దతు ధరకు మించి..
- కేసముద్రం మార్కెట్ లో క్విం. ధర రూ. 2423 లు పలికిన మొక్కజొన్న
- మక్కలకు రోజు రోజుకు పెరుగుతున్న మద్దతు
కేసముద్రం, ఆంధ్రప్రభ : మొక్కజొన్న రైతులు పంట చేతికొచ్చిన సమయంలో ధరలు లేక తీవ్రంగా నష్టపోయారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటా రూ.1,500 నుంచి రూ.1,900 వరకు కొనుగోలు చేయడంతో రైతులు తక్కువ ధరలకే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా క్వింటా రూ.2,400 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, గన్నీ సంచులు, గోదాంలు, హమాలీల కొరత వంటి కారణాలతో రైతులు కేంద్రాలను పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. అత్యధికంగా సన్న, చిన్నకారు, కౌలు రైతులు అప్పుల ఒత్తిడితో తక్కువ ధరలకే పంటను విక్రయించి నష్టపోయారు.

తర్వాత దశలో మొక్కజొన్న ధరలు క్రమంగా పెరుగుతుండగా, మంగళవారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో 549 బస్తాల మొక్కజొన్నలు వచ్చాయి. నెక్కొండ మండలం గుండెంగ గ్రామానికి చెందిన భూక్యా బాలు 170 బస్తాలు విక్రయించగా, ఓ వ్యాపారి క్వింటా రూ.2,423 చొప్పున కొనుగోలు చేశారు. మార్కెట్లో గరిష్ట ధర రూ.2,423, మోడల్ ధర రూ.2,355గా నమోదైంది.
ధరలు పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందుగానే పంట విక్రయించిన రైతులు నష్టపోయిన పరిస్థితి కొనసాగుతోంది. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి పంటల దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్క్ఫెడ్ ద్వారా మొత్తం 19,343 మంది రైతులు రూ.248.80 కోట్ల విలువైన 10,33,378.50 క్వింటాళ్ల మొక్కజొన్నలను విక్రయించారు. ఇప్పటివరకు 16,359 మంది రైతుల ఖాతాల్లో రూ.185.80 కోట్లు జమ కాగా, ఇంకా 2,984 మంది రైతులకు రూ.62.21 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఈ ఏడాది జిల్లాలో 1,07,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరగగా, దిగుబడులు అంచనాలకు తగ్గట్టుగా వచ్చినప్పటికీ మార్క్ఫెడ్ కొనుగోలు పరిమితుల కారణంగా కొంతమంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.

