అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రి..
- యాదాద్రి అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు
- పీపీపీ టూరిజం సర్క్యూట్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్
- భూ కేటాయింపులపై ప్రత్యేక పాలసీ…
- యాదాద్రి టూరిజంపై సీఎం ఫోకస్..
- తిరుమల మోడల్‌లో యాదాద్రి అభివృద్ధికి కార్యాచరణ
- యాదగిరిగుట్టకు కొత్త అభివృద్ధి బ్లూప్రింట్..
- గెస్ట్ హౌస్‌లు, టూరిజం సర్క్యూట్‌పై కీలక ఆదేశాలు
- యాదగిరిగుట్టను ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం దిశానిర్దేశం
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సమగ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆలయ విస్తరణ, భూముల కేటాయింపు, గెస్ట్ హౌస్‌ల నిర్మాణం, పర్యాటక అభివృద్ధి, భూసేకరణ తదితర అంశాలపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వి. నరేందర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంఓ కార్యదర్శి మానిక్ రాజ్, సీఎంఓ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, యాదాద్రి జిల్లా ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు మార్కెట్ ధర ప్రకారం భూమి కేటాయించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే వివిధ మఠాలకు భూముల కేటాయింపుపై ప్రత్యేక విధానం రూపొందించాలని, కుల సంఘాలకు స్థలాల కేటాయింపునకు స్పష్టమైన నిబంధనలతో కూడిన పాలసీ సిద్ధం చేయాలని ఆదేశించారు.
భూముల యాజమాన్య హక్కులు ఆలయానికే ఉండేలా చర్యలు తీసుకోవాలని, భూముల కేటాయింపులో తిరుమల తిరుపతి దేవస్థానం అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. యాదగిరిగుట్ట కొండపై గెస్ట్ హౌస్‌ల నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థలు, వ్యక్తుల జాబితాను సిద్ధం చేయాలని, విడతల వారీగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంలో కూడా తిరుమల నమూనాను అనుసరించాలని సూచించారు.
ఆలయ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణంపై ఇంజినీర్ల కమిటీ సమర్పించిన నివేదికను సమగ్రంగా పరిశీలించి వారం రోజుల్లో తుది నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా యాదగిరిగుట్టను అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
