సంక్షేమ పథకాలను బోర్డు ద్వారానే అమలు చేయాలి

ఉట్నూర్, ఆంధ్రప్రభ: భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించవద్దని, సంక్షేమ పథకాలను వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు అందించాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం సీఐటీయూ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న ఆధ్వర్యంలో ఉట్నూర్ తహసీల్దార్ రఘునాథ్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బొజ్జ ఆశన్న మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణం, సహజ మరణం, సంపూర్ణ, పాక్షిక అంగవైకల్య పథకాలను ప్రైవేట్ బీమా సంస్థల ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్–12ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉపయోగం లేని హెల్త్ టెస్టుల పేరుతో సంక్షేమ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను వెంటనే మంజూరు చేయడంతో పాటు రెన్యూవల్ కాని లక్షలాది లేబర్ కార్డులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఉట్నూర్ మండల అధ్యక్షుడు కుమ్రభీమ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.