Chennaraopet | ఆ పొలం కౌలు కోసం రైతులు పోటీ.. ఎందుకో తెలుసా.!

Chennaraopet | ఆ పొలం కౌలు కోసం రైతులు పోటీ.. ఎందుకో తెలుసా.!

వరంగల్ జిల్లాలోని ఓ పంట పొలం ఇప్పుడు చర్చగా మారింది..
ఆ పొలంలో పండేది పంట కాదు.. బంగారం అట..!!!

Chennaraopet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పొలం దున్నుతున్న కౌలు రైతుకు బంగారు ఆభరణాలు లభ్యం అవడంతో అందరి దృష్టి ఆ పొలం పైనే పడింది.. ఇంకా అందులో కనకపురాసులు ఉన్నాయని ప్రచారంతో ఆ పొలం బంగారంగా మారింది. అయితే.. ఇప్పటికే దొరికిన బంగారం పంపకాల పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చెరింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది.. ప్రతాప్ రెడ్డి అనే రైతుకు చెందిన 6 ఎకరాల పొలాన్ని బాలు అనే కౌలురైతు సాగు చేస్తున్నాడు.. పంట వేసేందుకు దుక్కి దున్నుతున్న క్రమంలో నాగలికి తాకి కొన్ని బంగారు ఆభరణలు లభ్యమయ్యాయి.
వీటిని రహస్యంగా ఇంటికి తీసుకెళ్లారు.. కానీ పంచుకునే విషయంలో కౌలు రైతు – కూలీలకు మధ్య గొడవ జరిగింది. కౌలు రైతు బాలు దొరికిన బంగారం అంతా తనకే చెందుతుందని చెప్పడంతో కూలీల ద్వారా ఈ వ్యవహారం బయటకు పొక్కింది. భూమి యజమాని ప్రతాప్ రెడ్డి దృష్టికి విషయం రావడంతో ఆయన ఇరువురిని మందలించి వదిలేశాడు.

అయితే, ప్రతాప్ రెడ్డి ఈ భూమిని ఆరు సంవత్సరాల క్రితం ఇదే గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి అనేవ్యక్తి నుండి భూమి కొనుగోలు చేశాడు. ఆరేళ్ల క్రితం భూమి అమ్మినవ్యక్తి ఇప్పుడు వాటా కోసం ఎదురుదాడి మొదలు పెట్టాడు. తన భూమిలో బంగారపు రాశులు ఉన్నాయని అందులో తనకు కూడా వాటా రావాలని ఎదురుదాడి మొదలు పెట్టాడు.. అంతేకాదు దొరికిన బంగారం సమాచారం పోలీసులకు అందించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వాటా తేల్చాలని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో ఈ బంగారం పంచాయతీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కుచేరింది. అయితే, ఈ భూమి పరిసర ప్రాంతాల్లో గతంలో కాకతీయుల కాలంనాటి ఆలయాలు ఉండేవట.. ఇంకా ఇందులో పెద్ద ఎత్తున బంగారపు నిధులు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ప్రతాప్ రెడ్డి భూమి కౌలుకు చేసేందుకు ఎంత ఇవ్వడానికైనా మేము సిద్ధమని రైతులు ముందుకు వస్తున్నారట.. దీంతో ఈ భూమి ఇప్పుడు బంగారం అయిందని అంతా చర్చ జరుగుతుంది. అసలు ఇందులో దొరికిన బంగారం ఎంత..? పంచుకున్నది ఎంత..? ఆ బంగారం ఎవరికీ చెందుతుంది..! అనే చర్చ మాత్రం జోరుగా సాగుతుంది.