ప్రత్యేక ఓటరు జాబితా సవరణను పరిశీలన..
తాడూరు, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రతి బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ) అత్యంత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, బిఎల్వోలు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాన్ని ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత బీఎల్ఓకు అందజేసేలా ప్రజలకు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సూచించారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని పక్షంలో ఓటరు జాబితాలో పేరు నమోదు కాకపోవచ్చనే అంశాన్ని ప్రతి కుటుంబానికి స్పష్టంగా వివరించాలని బీఎల్ఓలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తిస్థాయిలో విజయవంతం చేయడం ప్రతి అధికారికి బాధ్యత అని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా గడ్డం విజయ్ తో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఇలా పంపిణీ చేస్తున్నారు ఎలా అవగాహన కల్పిస్తున్నారనే విధానంపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయడమే కాకుండా, వాటిని ఎలా నింపాలి, ఏయే కాలమ్‌లలో ఏ వివరాలు నమోదు చేయాలి, ఎలాంటి ఆధార పత్రాలు జత చేయాలి, పూర్తి చేసిన ఫారాలను ఎప్పటిలోగా బీఎల్ఓలకు తిరిగి అందజేయాలి అనే విషయాలను ప్రజలకు ఓర్పుతో, స్పష్టంగా వివరించాలని కోరారు.
కొత్తగా అర్హత పొందిన యువత, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు సహా ప్రతి అర్హుడికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం అక్కడి ఓటర్లతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి బీఎల్ఓలు అందజేసిన ఎన్యూమరేషన్ ప్రొఫార్మాను ఎలా నింపుతారు, ఫారంలో ఏ వివరాలు నమోదు చేయాలి, అవసరమైన పత్రాలు ఏమిటి, పూర్తి చేసిన ఫారాలను ఎప్పటిలోగా బీఎల్ఓలకు అందజేస్తారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని గడువులోపు ఫారాలను సమర్పించాలని, ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, అందులో ప్రతి అర్హుడి పేరు ఉండడం అత్యంత అవసరమని అందుకే ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి బీఎల్ఓ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ నిర్దేశించిన గడువులోపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించాడు.జిల్లా కలెక్టర్ వెంట తాడూరు మండల తహసీల్దార్ రామకృష్ణ, ఎన్నికల విభాగం అధికారులు, రెవెన్యూ అధికారులు, బూత్ లెవల్ అధికారిని విజయా తదితరులు జిల్లా కలెక్టర్ వెంట పాల్గొన్నారు.
