వెంకంపల్లిలో ముమ్మరంగా డ్రైనేజీ పనులు..

  • ప్రజా ప్రభుత్వంలో గ్రామాభివృద్ధికి పెద్దపీట
  • సర్పంచ్ సంప్రీతి రాంరెడ్డి

దేవరకద్ర, ఆంధ్రప్రభ : దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండలం వెంకంపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధే ధ్యేయంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని గ్రామ సర్పంచ్ సంప్రీతి రాంరెడ్డి తెలిపారు. గ్రామ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో రూ.3 లక్షల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టి ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామంలో మురుగునీరు రోడ్లపైకి వచ్చి నిల్వ ఉండటం, వర్షాకాలంలో నీరు పేరుకుపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టామని వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, శుభ్రమైన గ్రామ నిర్మాణమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఏర్పడితే మురుగునీరు రహదారులపైకి రాకుండా నేరుగా వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామానికి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల సహకారం ఉంటే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారమే తమ బాధ్యతగా భావిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తున్నట్లు సర్పంచ్ సంప్రీతి రాంరెడ్డి వెల్లడించారు.