వైభవంగా ముగిసిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
శావల్యాపురం, ఆంధ్రప్రభ: మండలంలోని కారుమంచి గ్రామంలోని శ్రీలక్ష్మి అలివేలి మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు వైభవంగా నిర్వహించి మంగళవారం ముగించారు. ఆలయ అర్చకులు కొడవటిగంటి కృష్ణమాచార్యులు, రంగాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో తొలి రోజు అంకురార్పణ, రెండో రోజు అగ్ని ప్రతిష్ఠ, నిత్యహోమాలు, మూడో రోజు శేషవాహన సేవ, నాలుగో రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
చివరి రోజు చక్రస్నానం, పూర్ణాహుతి, వసంతోత్సవం, దొంగలదోపిడీ ఉత్సవాలతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. సుమారు 2,500 మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించగా, ప్రతిరోజూ గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని సేవలో పాల్గొన్నారు.
