మృత్యు కెరటాలు..

మృత్యు కెరటాలు..

హద్దు దాటుతున్న యువకులు.
విహారం… విషాదం .
తల్లిదండ్రులకు గర్భకోశ.

నర్సాపురం, ఆంధ్ర ప్రభ : సముద్ర తీరం అంతా ఒకేలా ఉండదు. ఒక్కో ప్రాంతం డేంజర్ అని పర్యాటకులకు స్థానికులు, అధికారులు సూచిస్తున్నా పట్టించుకోని యువకులు మృత్యువాతకు గురవుతున్నారు. హెచ్చరికలు జారీ చేసినా హద్దు మీరి సముద్ర లోతైన ప్రాంతాలకు వెళ్లి రాకాసి అలలుకు బలై పోతున్నారు. ఇలాంటి దుర్ఘటనలతో విహార యాత్రలు కాస్తా… విషాదంగా మారుతున్నాయి. మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో ఆదివారం ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో బీచ్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదువుకుంటున్న యువతీ యువకులు పెద్ద సంఖ్యలో బీచ్ లకు తరలిరావడం అందులో ఒకరిద్దరు హద్దులు దాటి లోతయిన ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు.

అప్పటి వరకు సరదాగా గడిపిన స్నేహితుడు కనబడకుండా పోవడం కొద్ది నిమిషాల్లో శవమై తేలడంతో స్నేహితులంతా షాక్ కు గురవుతున్నారు. కళ్లెదుట కదలాడిన స్నేహితుడు కళ్ళ ముందే నీట మునిగిపోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ ఘటన నుంచి తేరుకోలేక తల్లడిల్లుతున్నారు. స్నేహితులు ఇలా అంటే కన్న పేగు గర్భ కోశ వర్ణనాతీతం. చేతికందిన కొడుకు గంగ పాలు కావడం జీర్ణించుకోలేక పోతున్నారు. మృతదేహాలు వద్ద వారి రోదనలు అక్కడ వారిని కలచి వేస్తున్నాయి. హృదయ విదారక ఘటనలు చూపరులను కంట తడి పెట్టిస్తున్నాయి.

ప్రతీ ఆదివారం పేరుపాలెం బీచ్ కు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలి వస్తుంటారు. సందర్శకుల తాకిడితో కళకళ లాడే బీచ్ లలో యువకులు మృత్యువాత పడటంతో పర్యాటకులు విషాదంలో మునిగిపోతున్నారు. అధికారులు హెచ్చరికలను భేఖాతరు చేయడం వల్లే యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువత హద్దు మీరి లోతైన ప్రాంతాలకు వెళ్తున్నారని చెబుతున్నారు.

ఇద్దరు యువకులు మృతి..
స్నేహితులతో కలిసి విహార యాత్రకు పేరుపాలెం వచ్చిన ఇద్దరు యువకులు ఆదివారం రాకాసి అలలకు చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కు చెందిన ఉమామహేశ్వర రావు (21), పాలిటెక్నిక్ విద్యార్థి సీహెచ్ సుభాష్ (17) లు సముద్ర స్నానాలు చేస్తూ రాకాసి అలలులో కొట్టుకు పోయారు. విహార యాత్ర రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.

పర్యాటకులు జాగ్రత్త: సి ఐ.
పేరుపాలెం బీచకు వచ్చే పర్యాటకులు సముద్ర స్నానాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని నరసాపురం రూరల్ సి ఐ ఎం. నాగరాజు హెచ్చరించారు. ఆదివారం బీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన పై ఆయన స్పందించారు. పర్యాటకులు లోతు, అలల తీవ్రతను గమనించకుండా నీటిలోకి దిగడం ప్రమాదకరమని పోలీసుల సూచనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విహార యాత్ర విషాదం కాకుండా చూసుకోవాలని సూచించారు.