రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు!
అశ్వారావుపేట, ఆంధ్రప్రభ: పొలంలోకి మట్టి తరలించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ రైతు నుంచి రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసిన ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.
ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని దొంతికుంట చెరువు నుంచి తన పొలంలోకి మట్టి తోలుకునేందుకు అనుమతి కావాలని ఓ రైతు ఇరిగేషన్ శాఖ ఏఈ శ్రీనివాసరావును సంప్రదించాడు. అయితే అందుకు రూ.2 లక్షలు లంచంగా ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు.
దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సోమవారం సాయంత్రం కార్యాలయంలో ఏఈ శ్రీనివాసరావుకు రైతు రూ.2 లక్షలు అందజేస్తుండగా, ముందుగానే మాటువేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
