ఏరువాక పండుగ రోజే విషాదం..

నదిలో మునిగి రెండు ఎద్దుల మృతి

మంత్రాలయం, ఆంధ్రప్రభ : రైతులకు పండుగలాంటి ఏరువాక పౌర్ణమి రోజున మంత్రాలయం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక రైతు సురేశ్‌కు చెందిన రెండు ఎద్దులు తుంగభద్ర నదిలో మునిగి మృతి చెందాయి.

పండుగ సందర్భంగా ఎద్దులకు పవిత్ర స్నానం చేయించేందుకు సురేశ్ వాటిని ఎద్దుల బండిపై తుంగభద్ర నది తీరానికి తీసుకెళ్లాడు. నదిలోకి దించిన సమయంలో ఎద్దులు అదుపుతప్పి ఒక్కసారిగా లోతైన నీటిలోకి వెళ్లిపోయాయి. వాటిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయి, రెండు ఎద్దులు నీటిలో మునిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి.

సుమారు రూ.5 లక్షల విలువైన ఎద్దులు కళ్లముందే మృతి చెందడంతో రైతు సురేశ్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఏరువాక పండుగ రోజే ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

జీవనాధారమైన ఎద్దులను కోల్పోయిన రైతును ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.