ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
గోడపత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లాలో అన్ని వర్గాల ప్రజల్లో ఆత్మహత్యల నివారణపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జూన్ 16 నుంచి జూలై 15 వరకు నెలరోజుల పాటు నిర్వహించనున్న ఆత్మహత్యల నివారణ అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జిల్లా బాలల రక్షణ విభాగం, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది ఆధ్వర్యంలో కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, వివిధ శాఖల క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమాజంలో వివిధ కారణాలతో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి, వారికి “నేనున్నాను” అనే భరోసా కల్పిస్తూ అండగా నిలవాలని సూచించారు. అలాంటి మానసిక మద్దతు ఆత్మహత్య ఆలోచనల నుంచి వారిని బయటపడేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనుకునే సంస్థలు, వ్యక్తులు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్యా, జిల్లా మహిళా, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి ఎస్. సువర్ణ, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ ఉమా, జిల్లా బాలల రక్షణ అధికారి కె.వి. రమణ తదితరులు పాల్గొన్నారు.
