జూలై 1 నుంచి భారీ మార్పు!

పెట్రోల్, డీజిల్‌పై ఆంక్షలకు ముగింపు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై అమలు చేస్తున్న తాత్కాలిక పరిమితులను జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయనుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు సరఫరాపై ఏర్పడిన ఆందోళనకర పరిస్థితుల కారణంగా ముందు జాగ్రత్త చర్యగా విధించిన ఈ ఆంక్షలు ఇక నుంచి అమల్లో ఉండవని ప్రకటించింది.

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితులు మరింత దిగజారితే భారత్‌కు ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని భావించిన కేంద్రం, దేశీయ నిల్వలను సమర్థంగా వినియోగించేందుకు కొన్ని పరిమితులను అమలు చేసింది.

ఈ ఆంక్షల ప్రకారం, భారీగా ఇంధనం వినియోగించే వాణిజ్య వినియోగదారులు సాధారణ రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకుండా తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో డీజిల్ విక్రయాలపై పరిమితులు కూడా అమలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇంధన కొరత తలెత్తకుండా చూడటమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశం.

అయితే ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు కొంతమేర సాధారణ స్థితికి చేరుకోవడం, దేశంలో ఇంధన నిల్వలు తగినంతగా ఉండటంతో ఈ పరిమితులను ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. జూలై 1 నుంచి వాణిజ్య వినియోగదారులు కూడా సాధారణ పెట్రోల్ బంకుల నుంచే ఇంధనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు.

చమురు మార్కెట్‌లో పరిస్థితులు స్థిరంగా ఉండటం, సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకపోవడం వల్ల ప్రజలు ఇంధన కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ విక్రయాలు మళ్లీ పూర్తిస్థాయిలో సాధారణ విధానంలో కొనసాగనున్నాయి.