మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం..
- రెండు రోజుల్లో ముగ్గురిపై మూడు కేసులు నమోదు
- ముగ్గురు నిందితులు అరెస్ట్
- ముగ్గురు నిందితుల సెల్ఫోన్లు స్వాధీనం
- వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు అప్రమత్తంగా ఉండాలి
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలతో ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. గత రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మూడు కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇచ్చోడ మండలంలోని సిరిచల్మ గ్రామ ఉపసర్పంచ్ అబ్దుల్ అజీమ్ ఆర్మూర్‌లో జరిగిన ఘటనను వక్రీకరిస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వీడియోను రూపొందించి తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్టు చేసినందుకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా ఈరోజు ఇస్లాంపూర్‌కు చెందిన యూనుస్ (20), s/o యూసుఫ్ ఆర్మూర్ ఘటనను వక్రీకరిస్తూ ఇరు వర్గాలను రెచ్చగొట్టే పోస్టులు సోషల్ మీడియాలో ప్రచారం చేసినందుకు అతనిపై కూడా ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అలాగే ధనోరా (కె) గ్రామపంచాయతీ పరిధిలోని ఇంకారిగూడకు చెందిన జాడి జస్వంత్ (18), s/o రాజేశ్వర్ గ్రామంలో జరిగిన ఘటనను వక్రీకరిస్తూ గ్రామంలో, జిల్లాలో ప్రశాంతతకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకు, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని, అతని సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం, విద్వేషపూరిత పోస్టులు, వీడియోలు లేదా సందేశాలను ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నిజానిజాలు నిర్ధారించుకోకుండా షేర్ చేయవద్దని సూచించారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు తమ గ్రూపుల్లో లేదా స్టేటస్‌లలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు, వీడియోలు, సందేశాలు కనిపించిన వెంటనే వాటిని తొలగించి సంబంధిత వ్యక్తులను హెచ్చరించాలని తెలిపారు.
నిర్లక్ష్యం చేసినా లేదా ఉద్దేశపూర్వకంగా కొనసాగించినా అవసరమైతే గ్రూప్ అడ్మిన్లపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ప్రజలు శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. అనుమానాస్పద పోస్టులు లేదా విద్వేషపూరిత సందేశాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా జిల్లా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
