కేంద్రీయ విద్యాలయానికి ఆర్టీసీ బస్సు నడపాలని వినతి

  • ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : గుడిపేట్‌లోని కేంద్రీయ విద్యాలయానికి వెళ్లే విద్యార్థుల కోసం రామకృష్ణాపూర్ పట్టణం నుంచి నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామకృష్ణాపూర్ పట్టణం నుంచి సుమారు 25 మంది విద్యార్థులు ప్రతిరోజూ గుడిపేట్ కేంద్రీయ విద్యాలయానికి వెళ్లి వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు క్యాతన్‌పల్లి ఎక్స్‌రోడ్ నుంచి కేంద్రీయ విద్యాలయం వరకు మాత్రమే నడుస్తుండటంతో, రామకృష్ణాపూర్ నుంచి క్యాతన్‌పల్లి ఎక్స్‌రోడ్ వరకు చేరుకోవడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా బాలికలు, చిన్నతరగతుల విద్యార్థులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని, దీనివల్ల భద్రతాపరమైన సమస్యలతో పాటు పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని క్యాతన్‌పల్లి ఎక్స్‌రోడ్ నుంచి కాకుండా రామకృష్ణాపూర్ పట్టణం నుంచే గుడిపేట్ కేంద్రీయ విద్యాలయం వరకు ఆర్టీసీ బస్సు నడిపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.