Weaver Bird | ‘గిజిగాడి గూడు’… ఆర్కిటెక్చర్ అదుర్స్..!
Weaver Bird | ‘గిజిగాడి గూడు’… ఆర్కిటెక్చర్ అదుర్స్..!
తుఫానులు, పెనుగాలులను తట్టుకునే అద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యం..!
ఆకట్టుకుంటున్న బుల్లి పిట్ట అద్భుత గూళ్లు..!
ఆదిలాబాద్ జిల్లాలో విరివిగా కనిపిస్తున్న ‘గిజిగాడి’ గూళ్లు..!
Weaver Bird |ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: బుల్లి పిట్ట మేధస్సు.. అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం.. సహజీవనానికి చక్కటి నేర్పరితనం.. అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో నిర్మించిన ‘గిజిగాడి’ గూళ్లు ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కాలువలు, చెరువుల గట్లపై ఉన్న ఈత, తుమ్మ ముళ్ల చెట్ల కొమ్మలకు వేలాడుతూ కనిపించే గడ్డి పోచలతో అల్లిన అందమైన గూళ్లు చూపరులను ఫిదా చేస్తున్నాయి.
ఈ బుల్లి పక్షులు తమ చిట్టి మేధస్సు, అద్భుత నేర్పరితనంతో కేవలం మూడు వారాల్లోనే గడ్డి పోచలతో సొంతంగా గూళ్లు నిర్మించి, ఆడ పక్షులను ఆకట్టుకుని సహజీవనం ప్రారంభిస్తాయి. మానవ మేధస్సు, ప్రతిభకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇంజనీరింగ్ నైపుణ్యంతో అల్లిన ఈ గూళ్లు.. తుఫానులు వచ్చినా, భీకర గాలులు వీచినా ఒక్క గడ్డి పోచ కూడా ఊడిపోకుండా నిలబడటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
మరో విశేషం ఏమిటంటే.. ఈ అద్భుత గూళ్లను నిర్మించేది కేవలం మగ గిజిగాడు పక్షులే. ఆదిలాబాద్ కేంద్రానికి సమీపంలోని శంకర్‌గుట్ట, దుర్గానగర్, మావల, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోని కాలువ గట్ల వెంట ఉన్న తుమ్మ చెట్లకు వేలాడుతూ కనిపించే ఈ గూళ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
నైపుణ్యం.. నేర్పరితనం కలగలిపిన అద్భుత నిర్మాణం..!
గిజిగాడు నిర్మించే ప్రతి గూడు అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. గడ్డి పోచలను ముక్కుతో తెచ్చి, ప్రత్యేక అల్లికలతో శత్రువులు చొరబడలేని విధంగా మగ పక్షులు గూళ్లను నిర్మిస్తాయి. ఒక్కో గూడు నిర్మించడానికి 18 నుంచి 21 రోజుల సమయం పడుతుందని పక్షిశాస్త్ర నిపుణులు (ఆర్నిథాలజిస్టులు) చెబుతున్నారు.
శత్రువుల నుంచి రక్షణ పొందడం, గుడ్లు, పిల్లలను కాపాడుకోవడం కోసం ముళ్ల చెట్లపై కాలనీ తరహాలో వరుసగా గూళ్లు నిర్మించుకుంటాయి. ఆడ పక్షికి గూడు నచ్చితే వెంటనే అక్కడే వాలిపోయి మగ పక్షితో కలిసి ఆవాసం ఏర్పరచుకుంటుంది. పాములు, ఇతర జీవులు కూడా ఈ గూళ్లలోకి ప్రవేశించేందుకు సాహసించవని నిపుణులు పేర్కొంటున్నారు.
ఆడపిట్ట మనసు గెలిచే గిజిగాడు..!
గట్టిగా, అందంగా గూళ్లు నిర్మించేది కేవలం మగ గిజిగాడు పక్షులే. ఆ గూళ్లను చూసి ఆకర్షితురాలైన ఆడ పక్షి వాటిని అంగీకరించి సహజీవనం ప్రారంభించడం ఈ పక్షి ప్రత్యేకత.
ప్లోసిడే (Ploceidae) కుటుంబానికి చెందిన ఈ పక్షి శాస్త్రీయ నామం ప్లోసియస్ ఫిలిప్పీనస్ (Ploceus philippinus). తలపై పసుపు రంగు కిరీటం కలిగిన మగ పక్షి తన అద్భుత గూడు నిర్మాణంతో ఆడ పక్షిని ఆకట్టుకుంటుంది.
ఎంతటి బలమైన గాలులు వీచినా ఈ గూళ్లు చెదిరిపోవడం చాలా అరుదని స్థానిక హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆంధ్రప్రభకు తెలిపారు. పునరుత్పత్తి సమయంలో ఒక్కో ఆడ పక్షి రెండు నుంచి ఐదు గుడ్లు పెడుతుంది. అనంతరం పిట్ట పిల్లలకు నోటితో ఆహారం అందిస్తూ వాటిని పెంచుతుంది.
ఆదిలాబాద్, నిర్మల్, బోత్, ఖానాపూర్ ప్రాంతాల్లో జూన్ నెలలో చెట్ల కొమ్మలకు వేలాడుతూ కనిపించే గిజిగాడి గూళ్లు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గడ్డి పోచల అద్భుత అల్లికలతో నిర్మించిన ఈ గూళ్లు.. పక్షుల మేధస్సుకు, ప్రకృతి సృష్టి వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
