అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి..

  • కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం చేయాలి.
  • సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి.

పెద్దపల్లి రూరల్, ఆంద్రప్రభ : అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని సిపిఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పెద్దపల్లిలో సీపీఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, ఎలాంటి స్థలం లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని పేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని చెబుతూనే మరోవైపు వరంగల్ లో ఇండ్లులేని పేదలు గుడిసెలు వేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొలగించడం దుర్మార్గమైన చర్య అని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలకు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో జూలై 1న కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇరాన్ అమెరికా యుద్ధాన్ని ఆపలేని అసమర్థత ప్రధాని మోదీ అని, ప్రధాని మోది ట్రంప్ కు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, కొందరు బిజెపి నాయకులు బెంగాల్ తరహాలోనే ఎస్ఐఆర్ ప్రక్రియ చేపడతామని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణలో ఒక్క ఓటు కూడా పోకుండా ఎస్ఐఆర్ నిర్వహించాలని అధికారులను డిమాండ్ చేశారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం, మతోన్మాదానికి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ వామపక్షాలు కలిసి పోరాటం చేస్తాయని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై పెద్దపెల్లి మండల అధ్యక్షులు రమేష్ వినతి పత్రం అందించగా త్వరలోనే ఈ విషయమై మంత్రులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి సునీల్, కార్పొరేటర్ మార్కాపూర్ సూర్య, నాయకులు రమేష్, నవీన్, కల్లేపల్లి రవి, జింక విటల్, బాలసాని లెనిన్, రేణిగుంట్ల ప్రీతం, తదితరులు పాల్గొన్నారు.