శ్రీకాంత్ పోరాటం వృథా.. చేజారిన యూఎస్ టైటిల్ !
- ఫైనల్లో చైనీస్ తైపీ షట్లర్ సు లీ-యాంగ్ చేతిలో ఓటమి
- మూడు గేమ్‌ల పోరులో రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత స్టార్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ యూఎస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిపోయాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన సు లీ-యాంగ్ చేతిలో మూడు గేమ్‌ల పోరులో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచాడు.
దాదాపు గంటకు పైగా సాగిన హోరాహోరీ పోరులో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 15-21, 21-16, 9-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. తొలి గేమ్ కోల్పోయిన తర్వాత రెండో గేమ్‌ను అద్భుతంగా గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లినా, చివరి గేమ్‌లో ప్రపంచ 46వ ర్యాంకర్ సు లీ-యాంగ్ దూకుడుకు తట్టుకోలేకపోయాడు.
మ్యాచ్ ఆరంభంలో శ్రీకాంత్ చురుగ్గా ఆడినా, కొన్ని అనవసర తప్పిదాలు అతడిని వెనక్కి నెట్టాయి. రెండో గేమ్‌లో మాత్రం అద్భుతమైన నెట్ ప్లే, స్మాష్‌లతో పుంజుకుని మ్యాచ్‌ను సమం చేశాడు. అయితే నిర్ణయాత్మక గేమ్‌లో సు లీ-యాంగ్ వేగవంతమైన ఆటతో ఆధిపత్యం చెలాయించి శ్రీకాంత్‌కు అవకాశమే ఇవ్వలేదు.
ఈ సీజన్‌లో శ్రీకాంత్‌కు ఇదే తొలి ఫైనల్ కాగా, టైటిల్ మాత్రం అందకుండా పోయింది. గత ఏడాది మలేషియా మాస్టర్స్ సూపర్-500, సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్-300 టోర్నీల్లో కూడా ఆయన రన్నరప్‌గా నిలిచాడు. మరోవైపు, 24 ఏళ్ల సు లీ-యాంగ్ తన కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా, యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్ ప్రదర్శన భారత బ్యాడ్మింటన్ అభిమానుల్లో మళ్లీ ఆశలు రేకెత్తించింది.
