ఘనంగా సహకార వారోత్సవాలు ప్రారంభం..
- జెండాను ఆవిష్కరించిన చైర్మన్ దామోదర్ రెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) కార్యాలయం ఆవరణలో సహకార వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సహకార పతాకాన్ని ఆవిష్కరించి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ వారోత్సవాలు జూన్ 29 నుండి జూలై 6వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతాయని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. రైతు సంక్షేమమే సహకార సంఘాల ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
ప్రస్తుత వానాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన నాణ్యమైన వరి విత్తనాలు, రసాయన ఎరువులు, కాంపోస్ట్ ఎరువులను పీఏసీఎస్ కార్యాలయంలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మెంబర్లు చెన్నగోని అంజయ్య గౌడ్, పబ్బతి వెంకటయ్య, దొడ్డి శ్రీశైలం, గుండెబోయిన రూపమ్మ, ముల్లయ్య, సంఘ కార్యదర్శి (సెక్రటరీ) వై. రమేష్, సిబ్బంది ఎం. మహేష్, ఎస్. మహిపాల్ రెడ్డి, పి. నరేష్, బి. నిఖిల్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
