గుండెపోటుతో కూలీ మృతి..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో గుండెపోటుతో ఓ కూలీ మృతి చెందడంతో విషాదం నెలకొంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మందపల్లి గ్రామానికి చెందిన బోర్లకుంట శంకర్ (50) ఉపాధి కోసం 20 ఏళ్ల క్రితం నర్సాపూర్‌కు వచ్చి కుటుంబంతో అద్దె ఇంట్లో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

సోమవారం శంకర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అల్లుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోని తర్లపాడు గ్రామం వద్ద మృతి చెందాడు.

మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆయనే ఆధారంగా ఉండటంతో ఆయన మృతితో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ ఘటనతో నర్సాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నిరుపేద కుటుంబానికి చెందిన శంకర్ మృతితో వారి జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందని, దాతలు ముందుకు వచ్చి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని గ్రామ సర్పంచ్ డీఎస్ సంగీత-రాజేష్, ఉప సర్పంచ్ జంగం రమేష్ కోరారు.