రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత

ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులతో కలిసి వ్యవసాయ పనులు ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థసారధి

ముసునూరు, ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ముసునూరు మండలం లోపూడి గ్రామంలో భూమాతకు, వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించి సంప్రదాయ రీతిలో వ్యవసాయ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సంప్రదాయ రైతు దుస్తులు ధరించిన మంత్రి ఎడ్ల బండిపై గ్రామమంతా తిరుగుతూ రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మంత్రి మాట్లాడుతూ.. ఏరువాక పౌర్ణమి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అత్యంత పవిత్రమైన వ్యవసాయ పండుగ అని, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున ఖరీఫ్ సాగును శాస్త్రోక్తంగా ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వ్యవసాయాన్ని రైతులకు మరింత లాభసాటిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. రైతులు, కౌలు రైతులకు పంట రుణాలు, ఉచిత పంట బీమా, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, సాగు యాంత్రీకరణ పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి, సొమ్మును నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు.

రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రైతులకు సూచించారు. 80 శాతం సబ్సిడీపై వరి, పత్తి, మిర్చి, పప్పుధాన్యాల విత్తనాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఖరీఫ్–2026 ఉచిత పంట బీమా నమోదు ప్రక్రియ ప్రారంభమైనందున ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు.

డ్రోన్ల వినియోగంతో సాగు ఖర్చులు తగ్గుతాయని, సబ్సిడీపై డ్రోన్లు అందిస్తున్నామని చెప్పారు. భూసారం పెంపు కోసం పచ్చరొట్టి విత్తనాలు పంపిణీ చేయడంతో పాటు భూసార పరీక్షలు నిర్వహించి సాయిల్ హెల్త్ కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. పొలం బడి కార్యక్రమాల ద్వారా ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

ప్రతి మండలంలో ముగ్గురు ప్రగతిశీల రైతులను ఉత్తమ రైతు అవార్డులతో సత్కరిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, ఆక్వా, మామిడి, పత్తి, పొగాకు, వరి, మిర్చి తదితర వ్యవసాయ రంగాలకు రాయితీలు అందిస్తూ రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బి. వినూత్న, జి. రఘు, వై. శ్రీనివాసు, వెంకటేశ్వరరావు, రమణ, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.