మూలా నక్షత్రంతో చదువుల తల్లి జ్ఞాన సరస్వతి సన్నిధిలో చిన్నారుల తొలి అడుగు

భారీగా తరలివచ్చిన భక్తులు.. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు


బాసర, ఆంధ్రప్రభ: విద్యకు ఆదిదేవతగా పూజలందుకుంటున్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న బాసర పుణ్యక్షేత్రం సోమవారం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా తమ చిన్నారుల విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టేందుకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం చిన్నారుల కేరింతలు, భక్తుల అమ్మవారి నామ స్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

‘ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః’ అనే మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ అర్చకులు చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. బియ్యంతో నింపిన పళ్లెంలో చిన్నారుల చేత ‘ఓం’, ‘శ్రీ’, ‘అ’ వంటి తొలి అక్షరాలను దిద్దించి, విద్యాభ్యాసానికి శుభారంభం చేశారు. తమ పిల్లలు విద్యావంతులై ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ తల్లిదండ్రులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో మూలా నక్షత్ర సరస్వతి పూజను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అర్చనల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయంలో రోజంతా భక్తుల రద్దీ కొనసాగగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రతి నెల మూలా నక్షత్రం రోజున బాసరలో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు విద్య, జ్ఞానం, వాక్పటిమ లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో బాసరకు చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకుని తమ చిన్నారుల విద్యాభ్యాసానికి పవిత్ర శ్రీకారం చుడుతున్నారు.