AP AIMS App | ఏపీఏఐఎంఎస్ యాప్‌తో ఎరువుల పంపిణీ
AP AIMS App | ఏపీఏఐఎంఎస్ యాప్‌తో ఎరువుల పంపిణీ
AP AIMS App | ఖరీఫ్ సీజన్లో ఎరువుల అవసరం
యాప్ అవగాహన లేక రైతులకు ఇబ్బందులు
ఆర్ఎస్కేల్లో నిల్వలపై ఆరోపణలు
డీఏపీ, యూరియా బ్లాక్ మార్కెట్ ఆరోపణలు
AP AIMS App | అమరావతి, ఆంధ్రప్రభ: పారదర్శకంగా ఎరువుల పంపిణీ కోసం తీసుకొచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతుల విషయంలో గందరగోళం సృష్టిస్తోంది. యూరియా, డీఏపీ వాడకాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ రెండింటినీ ఏపీ ఏఐఎంఎస్ (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా మాత్రమే విక్రయించాలని నిబంధన పెట్టడం ఇందుకు కారణమైంది.
రైతులకు వ్యవసాయ శాఖ ఎటువంటి అవగాహన కల్పించకుండానే కొనుగోళ్లకు యాప్ వినియోగాన్ని తప్పనిసరి చేయడంతో ఇదే అదనుగా వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తెరతీశారు. నూతన నిబంధనల ప్రకారం ఏపీఏఐఎంఎస్ యాప్‌ను రైతులు తమ సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని అందులో ఆధార్ నంబర్ ద్వారా నమోదు కావాలి. అప్పుడు ఆ యాప్‌లో సంబంధిత రైతుకు ఎంత భూమి ఉంది, ప్రస్తుతం అందులో ఏయే పంటలు సాగులో ఉన్నాయి, ఆ పంటలకు తొలివిడతగా ప్రస్తుతం ఎంత డీఏపీ, యూరియా పొందేందుకు అర్హత ఉందన్నది తెలుస్తుంది.
యాప్‌లో సంబంధిత రైతు అర్హత ఉన్న పరిమాణం వరకు దుకాణంలోనైనా ఎరువులను పొందవచ్చు. అంతకుమించి డీఏపీ, యూరియా ఇవ్వరన్న నిబంధన విధించారు.
ఈ సీజన్లో 77.12 లక్షల ఎకరాలు
ఖరీఫ్ సాగుకు సంబంధించి రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణం 77.12 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 81.50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా 37.85 లక్షల ఎకరాల్లో వరి, 9.89 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 12.87 లక్షల ఎకరాల్లో పత్తి, 8 లక్షల ఎకరాల్లో అపరాలు తదితర పంటల సాగును లక్ష్యంగా పెట్టారు.
ఈ సీజన్‌కు 18.09 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 8.50 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు 2,97,733 మంది రైతులకు 48,588 మెట్రిక్ టన్నుల యూరియా, 12,874 మెట్రిక్ టన్నుల డీఏపీ పంపిణీ చేసినట్లు చెబుతున్నారు.
అయితే రైతులకు యాప్ వినియోగంపై అవగాహన లేకపోవడంతో దీన్ని సాకుగా తీసుకుని వ్యాపారులు రైతులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీఏఐఎంఎస్ యాప్‌పై రైతులకు కనీస అవగాహన కల్పించలేదు. వ్యవసాయ శాఖ అధికారులు తమ క్షేత్రస్థాయి సిబ్బందికి, ఎరువుల డీలర్లకు మాత్రమే యాప్‌పై శిక్షణ తరగతులు నిర్వహించారు. అయినా రైతులు యాప్‌లో నమోదు కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆర్ఎస్కేల్లో నిల్వలపై ఆరోపణలు
సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఉన్నాయని జిల్లాల వ్యవసాయాధికారులు చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. డీఏపీ, యూరియా కోసం డీలర్ల వద్దకు వెళ్తుండగా వారు ఏపీఏఐఎంఎస్ యాప్ ఉంటేనే ఎంత ఇవ్వవచ్చో చెక్ చేసి ఇస్తామంటున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తెరతీసి సొమ్ము చేసుకుంటున్నారు.
డీఏపీ బస్తా రూ.1,450కి విక్రయించాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని బస్తాకు రూ.300 అదనంగా వసూలు చేస్తున్నారు. యూరియా బస్తా రూ.270కి విక్రయించాల్సి ఉండగా రూ.150 అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
