US Green Card | యూఎస్ సుప్రీంకోర్టు కీలక తీర్పు

US Green Card | యూఎస్ సుప్రీంకోర్టు కీలక తీర్పు

US Green Card | గ్రీన్‌కార్డు హోల్డర్లపై కఠిన నిబంధనలకు మార్గం
యూఎస్ సుప్రీంకోర్టు 6:3 తీర్పు ఏం చెబుతోంది?
ఎలాంటి నేరారోపణలు ఉంటే ఇబ్బందులు?
డిటెన్షన్, బహిష్కరణకు అవకాశం ఎలా ఉంటుంది?
భారతీయ గ్రీన్‌కార్డు హోల్డర్లపై ప్రభావం ఎంత?

US Green Card | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో శాశ్వత నివాస హక్కు కలిగి ఉన్న వారికి ఇకపై ఇమ్మిగ్రేషన్ పరంగా మరింత కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. యూఎస్ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన 6:3 తీర్పుతో నేరారోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్‌కార్డు హోల్డర్లపై అమెరికా సరిహద్దు అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఈ తీర్పు అమెరికా వలస చట్టాల అమలులో కీలక మలుపుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా సుప్రీంకోర్టు విచారించిన బ్రాంచే వీలౌ కేసులో విదేశీ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగి వచ్చే గ్రీన్‌కార్డు హోల్డర్‌పై నైతికంగా తీవ్రమైన నేరాభియోగాలు ఉంటే, నేరం జరిగిందని ప్రభుత్వం స్పష్టమైన, బలమైన ఆధారాలు చూపాల్సిన అవసరం లేదని ఈ తీర్పు పేర్కొంది. సరిహద్దు అధికారులకు నమ్మడానికి తగిన కారణం ఉంటేనే అతడిని సాధారణ శాశ్వత నివాసిగా కాకుండా, అడ్మిషన్ కోరుతున్న వ్యక్తిగా పరిగణించి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలోకి పంపవచ్చని పేర్కొంది.

ఈ తీర్పు అమెరికా బయటకు వెళ్లి తిరిగి వస్తున్న గ్రీన్‌కార్డు హోల్డర్లపై ప్రభావం చూపుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి నకిలీ వస్తువుల విక్రయం, మోసం, దొంగతనం, కొన్ని ఆర్థిక నేరాలుగా పరిగణించే ఇతర నేరాలపై ఆరోపణలు ఉన్నవారిపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు.

ఈ కేసులో ముక్ చోయ్ లావ్ అనే గ్రీన్‌కార్డు హోల్డర్ విదేశీ పర్యటన తర్వాత అమెరికాకు తిరిగి వస్తుండగా, గతంలో నకిలీ వస్తువుల కేసులో ఆరోపణలు ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రత్యేక విచారణకు పంపించారు. ఆ చర్యను ఆయన కోర్టులో సవాలు చేయగా ఎదురుదెబ్బ తగిలింది. ఇలాంటి వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో డిటెన్షన్ లేదా బహిష్కరణ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది.

గ్రీన్‌కార్డు అనేది అమెరికాలో శాశ్వతంగా నివసించే హక్కును కల్పించే పత్రం. దీంతో వ్యక్తి అమెరికాలో శాశ్వతంగా నివసించవచ్చు. కుటుంబ సభ్యులకు స్పాన్సర్‌గా ఉండవచ్చు. కొన్నేళ్ల తర్వాత అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గ్రీన్‌కార్డు అంటే పౌరసత్వం కాదు. చట్ట ఉల్లంఘనలు జరిగితే ప్రభుత్వం దానిని రద్దు చేసే అధికారం కలిగి ఉంటుంది.

అమెరికాలో లక్షలాది భారతీయులు గ్రీన్‌కార్డు హోల్డర్లుగా నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మందిపై ఈ తీర్పు ప్రత్యక్ష ప్రభావం ఉండకపోయినా, పెండింగ్ క్రిమినల్ కేసులు, మోసం లేదా ఇతర తీవ్రమైన నేరాల ఆరోపణలు ఉంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.