‘చిప్పకూడు’కు అర్థం చెప్పాలి.. కవితకు జనసేన కౌంటర్‌

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. పవన్‌ కళ్యాణ్‌ పై కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ గా జనసేన తీవ్ర స్థాయిలో స్పందించింది. జనసేన తెలంగాణ అధికార ప్రతినిధి సోషల్ మీడియా వేదికగా కవితను లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేశారు.

పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఆయన, తెలంగాణ ఉద్యమం పేరుతో రాజకీయాలు చేసి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశారా అని కవితపై ఆరోపించారు. జాగృతి సంస్థ కార్యకలాపాలు, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు, తీహార్ జైలు వ్యవహారాలను ప్రస్తావిస్తూ ఆమెపై విమర్శలు గుప్పించారు.

ఇదే సమయంలో ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలను కూడా జనసేన ప్రస్తావించింది. ‘ఇడుపు కాయితం’ అనే పదానికి పవన్ కళ్యాణ్‌కు అర్థం తెలియదని విమర్శించిన కవితకు, ముందుగా ‘చిప్పకూడు’ అనే పదానికి అర్థం చెప్పాలని జనసేన కౌంటర్ ఇచ్చింది. ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని పేర్కొంది.

అలాగే పవన్ కళ్యాణ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించిన జనసేన నేత, తెలంగాణ అమరవీరుల త్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించొద్దని సూచించారు. రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి వివాదాస్పద అంశాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.