గంజాయి మహమ్మారిని తరిమికొడదాం..

  • ఈగల్ బృందం, నార్కోటిక్ డాగ్‌తో రామకృష్ణాపూర్‌లో విస్తృత తనిఖీలు

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : గంజాయి మహమ్మారిని సమాజం నుంచి తరిమికొట్టాలని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ జాడి శ్రీధర్ పిలుపునిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల డీసీపీ, బెల్లంపల్లి ఏసీపీ ఆదేశాల మేరకు ఆదివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సీహెచ్‌పీ, భగత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈగల్ బృందం, నార్కోటిక్ డాగ్ సహాయంతో పలు అనుమానస్పద గృహాల్లో సోదాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ జాడి శ్రీధర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఈగల్ టీంను ఏర్పాటు చేసిందని, ఈ బృందం 24 గంటలూ తనిఖీలు చేస్తుందని తెలిపారు. పట్టణంలో ఎవరైనా గంజాయి సేవిస్తున్నా, విక్రయిస్తున్నా, అనుమానిత వ్యక్తులు కనిపించినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను, యువతను కోరారు.ఈ కార్యక్రమంలో ఈగల్ బృందం సభ్యులు, రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బందిపాల్గొన్నారు.