ముత్యాలమ్మకు భక్తి శ్రద్ధలతో బోనాలు..

మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిలా మంగపేట మండలంలోని బోరు నర్సాపురం గ్రామంలో ఆదివారం బోనాల సందడి నెలకొంది. బోరు నర్సాపురం గ్రామంలో శనివారం బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించగా ఆదివారం ముత్యాలమ్మకు భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలు సందర్భంగా మహిళలు సుందరంగా అంకరించిన బోనాలను తలపై ఎత్తుకుని డప్పు చప్పుళ్లతో కుటుంబ సమేతంగా ముత్యాలమ్మ తల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు. ముత్యాలమ్మకు పసుపు, కుంకుమ, గాజులు, కొత్త చీర సమర్పించి, బోనాలు చెల్లించారు. కొందరు భక్తులు కోళ్లు, మేకలను బలి ఇచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. తమ కుటుంబంతో పాటు గ్రామంలో ప్రతీ ఒక్కరికి మంచి జరగాలని, పంటలు మంచిగా పండి ఊరంతా చల్లగా ఉండాలంటూ ముత్యాలమ్మను వేడుకున్నారు.