అమరావతిలో దాడులు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ..
వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులపై దాడి దారుణం..
‘ప్రశ్నిస్తే రాళ్ల దాడులా…..
ఏపీలో నడుస్తోంది రెడ్‌బుక్ రాజ్యాంగం’
‘బాధితుల కార్ల ధ్వంసం…
వారిపైనే రివర్స్ కేసులు పెట్టడం దుర్మార్గం’
అమరావతి ప్రజల రాజధాని కాదు… కొందరి రాజధానిగా మారింది’
‘రైతుల కన్నీటికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి…
అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ ఆంధ్రప్రభ : అమరావతి రాజధాని ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీలు, పోలీసులపై జరిగిన దాడిని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. అమరావతి ప్రాంత రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన తమ పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై కూడా రాళ్లు రువ్వడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని విమర్శించారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, అరుణ్, మంగళగిరి ఇన్‌చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు రాజధాని రైతుల సమస్యలను తెలుసుకునేందుకు లింగాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నిడమర్రు గ్రామాలకు వెళ్లిన సమయంలో ఈ దాడులు జరిగాయని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలవడానికి వెళ్లిన తమ పార్టీ నాయకుల వాహనాలను ధ్వంసం చేశారని, పోలీసులపై కూడా రాళ్ల దాడులు జరిగినట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
ఇంత జరిగినా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం బాధాకరమని, రాష్ట్రంలో “రెడ్‌బుక్ రాజ్యాంగం” అమలవుతోందనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే దాడులు చేయడం, బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వెలంపల్లి విమర్శించారు. మూడు పంటలు పండే భూములను బలవంతంగా తీసుకుంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, గతంలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ పూర్తిస్థాయి న్యాయం జరగలేదని ఆరోపించారు. భూములివ్వని రైతుల పొలాల్లోకి నీటిని మళ్లించడం, మట్టిని వేయించడం వంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని అన్నారు.
అమరావతి నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించిన ఆయన, ఎస్‌ఎఫ్‌టీ నిర్మాణ వ్యయాన్ని అసాధారణంగా పెంచి చూపిస్తున్నారని, సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని పేరుతో భారీ అప్పులు తెచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటిస్తున్నాయని, దానిని బలహీనతగా భావించి దాడులు కొనసాగిస్తే ప్రజలు తగిన సమయంలో సమాధానం చెబుతారని హెచ్చరించారు. అమరావతిని ప్రజల రాజధానిగా కాకుండా కొందరి ప్రయోజనాల కోసం పరిమితమైన రాజధానిగా మార్చారని విమర్శించారు.
రైతుల కంట కన్నీరు ఏ ప్రభుత్వానికీ మంచిది కాదని పేర్కొన్న వెలంపల్లి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కక్షసాధింపు రాజకీయాలు, రౌడీయిజం, గూండాయిజాన్ని అరికట్టి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ స్ఫూర్తితో పాలన సాగించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం, అభివృద్ధిపై దృష్టి పెట్టడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ప్రశ్నించే వారిపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొంటూ ఈ ఘటనను వైఎస్సార్సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
