బతికుండగానే ‘మరణ’ శాసనం
- రెవెన్యూ శాఖలో భూమి మళ్లింపు కలకలం
- జీవించి ఉన్న వ్యక్తి పేరిట విరాసత్ పట్టా మార్పిడి, ఆపై భూమి విక్రయం
- బాధితుడి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- కలెక్టర్ జోక్యంతో పట్టా రద్దు, లావాదేవీలు బ్లాక్..ఇద్దరు అధికారుల సస్పెన్షన్
మంథని, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా మంథనిలో రెవెన్యూ శాఖ పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్న భూ పట్టా మార్పిడి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్లు సమర్పించిన పత్రాల ఆధారంగా విరాసత్ పట్టా మార్పిడి జరిగినట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా గుర్తించడంతో కలెక్టర్ కోయ శ్రీహర్ష వెంటనే జోక్యం చేసుకుని పట్టా మార్పిడిని రద్దు చేయడంతో పాటు సంబంధిత భూమిపై అన్ని రకాల లావాదేవీలను నిలిపివేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తిస్తూ సంబంధిత జీపీవో అయోధ్య, ఆర్ఐ అనిల్‌రెడ్డిని సస్పెండ్ చేశారు.
అసలేం జరిగింది?..
అధికారిక వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడకు చెందిన నారమల్ల సమ్మయ్య పేరిట మంథని శివారులోని సర్వే నంబర్ 183/Aలో 4 ఎకరాల 35 గుంటల భూమి ఉంది. సమ్మయ్య మరణించినట్లు సమర్పించిన పత్రాల ఆధారంగా 28-04-2025న విరాసత్ నమోదు జరిగినట్లు రికార్డుల్లో నమోదైంది. అనంతరం 02-06-2026న సేల్ డీడ్ ద్వారా భూమి విక్రయం జరిగినట్లు ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికేట్లో నమోదైంది. తన భూమి ఇతరుల పేరిట మారి విక్రయమైన విషయం తెలుసుకున్న సమ్మయ్య తాను జీవించి ఉన్నానని చెబుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.
లావాదేవీలు బ్లాక్..

కలెక్టర్ జోక్యం అనంతరం సంబంధిత సర్వే నంబర్‌పై “Transaction Blocked” నమోదు చేసినట్లు తాజా ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికేట్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆ భూమికి సంబంధించిన తదుపరి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి
ఈ ఘటనతో పలు కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి..
జీవించి ఉన్న వ్యక్తి పేరుపై మరణ ధ్రువీకరణ పత్రం ఎలా సమర్పించబడింది?
విరాసత్‌కు ఆధారమైన కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు ఎవరు జారీ చేశారు?
నోటరీ అఫిడవిట్ ఎక్కడ, ఎవరి ద్వారా సిద్ధమైంది?
మీ సేవ కేంద్రంలో దరఖాస్తు ఏ ఆధారాలతో స్వీకరించారు?
క్షేత్రస్థాయి విచారణలో అధికారులు ఎలాంటి పరిశీలన చేశారు?
సాక్షులుగా పేర్కొన్న వ్యక్తులు ఏ ఆధారాలతో ధ్రువీకరణ ఇచ్చారు?
అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారుల వివరణ
సస్పెన్షన్‌కు గురైన అధికారులు తమకు సమర్పించిన పత్రాల ఆధారంగానే విరాసత్ నమోదు చేసినట్లు, తప్పుడు పత్రాలు సమర్పించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వివరణ ఇచ్చినట్లు సమాచారం.
విఆర్ఓ వ్యవస్థ రద్దు అనంతరం క్షేత్రస్థాయిలో పత్రాల నిజానిజాల నిర్ధారణ బలహీనపడిందనే విమర్శలకు ఈ ఘటన బలం చేకూర్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాధితుడి ఫిర్యాదు లేకపోతే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చేదా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
మరణ ధ్రువీకరణ పత్రం జారీ ప్రక్రియ, నోటరీ అఫిడవిట్, మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు స్వీకరణ, విరాసత్ పట్టా మార్పిడి, రెవెన్యూ అధికారుల ధ్రువీకరణ, భూమి విక్రయ లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల పాత్రపై సమగ్ర దర్యాప్తు జరిపి, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
