ఆఖరి విజయం అమరావతిదే..
చివరి లీగ్ మ్యాచ్ లో అమరావతి అద్భుత విజయం
మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన అమరావతి
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎస్‌వీ రాహుల్
ప్లే ఆఫ్స్‌కు చేరిన 4 జట్లు
విజయవాడ, ఆంధ్రప్రభ: ఏపీఎల్-2026 సీజన్-5లో భాగంగా మంగళగిరి వేదికగా నాలుగో రోజు జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు, రాయల్స్ ఆఫ్ రాయలసీమపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన అమరావతి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించి శుభారంభం అందించగా, ఎస్‌వీ రాహుల్ 43 బంతుల్లో 70 పరుగులు (5 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో వరుణ్ సాత్విక్ 19 బంతుల్లో 34 పరుగులు (1 ఫోర్, 3 సిక్సర్లు) చేసి మెరిశాడు. రాయలసీమ బౌలర్లలో వాసు రెండు వికెట్లు తీశాడు.
లక్ష్య ఛేదనలో రాయల్స్ ఆఫ్ రాయలసీమకు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. కీలక బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరడంతో జట్టు ఒత్తిడిలో పడింది. విష్ణు దత్త 34 బంతుల్లో 45 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్), కార్తీక్ రామన్ 15 బంతుల్లో 29 పరుగులు (4 సిక్సర్లు) చేసి పోరాడినా ఫలితం లేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో రాయలసీమ 137 పరుగులకు ఆలౌట్ కావడంతో అమరావతి 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. అమరావతి బౌలర్లలో ఏరా సందీప్ 4 వికెట్లు, టోషిత్ యాదవ్, వర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎస్‌వీ రాహుల్ ఎంపికయ్యాడు.
ప్లే ఆప్స్ కు చేరిన నాలుగు టీంలు
ఈ విజయంతో ఏపీఎల్-2026 సీజన్-5 లీగ్ మ్యాచ్‌లు ముగియగా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న అమరావతి రాయల్స్‌తో పాటు భీమవరం బుల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, విజయవాడ సన్ షైనర్స్ జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
