జూలై 9న వర్కింగ్ జర్నలిస్టుల మహాసభ
జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాదగిరి, విష్ణు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే-ఐజేయూ) మహాసభ వచ్చే నెల 9వ తేదీన సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్ లో జరుగుతుందని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా అర్హులైన వారికి ఇంటి స్థలం తో పాటు హెల్త్ కార్డును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతున్నామని అన్నారు.
ప్రభుత్వాలు మారినప్పటికీ, జర్నలిస్టులకు న్యాయం జరగడం లేదని తెలిపారు. అంతేకాకుండా మిగిలిన వారందరికీ కూడా అక్రిడేషన్ కార్డులను జారీ చేయాల్సిందిగా తమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని వివరించారు. ఈ సమస్యలన్నింటిపై చర్చించడానికి జిల్లా మహాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు. జూలై 9న ఉదయం 11 గంటలకు మహాసభ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే పైసల్ తో పాటు సంఘం రాష్ట్ర నేతలు పాల్గొంటారని చెప్పారు.
జిల్లా మంత్రితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారని వివరించారు. అందువల్ల జిల్లాలోని జర్నలిస్టులంతా ఈ మహాసభకు తరలి కావాల్సిందిగా కోరారు. జర్నలిస్టుల ఐక్యతను చాటి చెప్పేందుకు సువర్ణ అవకాశమని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా శాఖ నూతన కమిటీ ఎన్నిక కూడా అదే రోజు నిర్వహిస్తామని తెలిపారు. అందువల్ల ప్రతి జర్నలిస్టు మహాసభకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
