వరసిద్ధి వినాయకుడి సేవలో రాష్ట్ర డీజీపీ
కాణిపాకం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా శనివారం చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. డీజీపీతో పాటు అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) మధుసూదన్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి కూడా ఆలయ దర్శనంలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో డీజీపీని సత్కరించారు. ఆలయ దర్శనం అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు శాఖ ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన, ప్రజా కేంద్రిత పోలీసు సేవలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తోందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణ, సాంకేతికత ఆధారిత ఆధునిక పోలీసింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందని, ప్రతి పౌరుడు పోలీసు శాఖకు సహకరించి శాంతియుత, సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ జె. వెంకటనారాయణ, కాణిపాక దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్, ఆలయ అధికారులు, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.
