Rs.5lakhs | మాజీ ప్రియురాలి హత్య వెనుక దాగిన దారుణ నిజాలు..
నిర్మానుష్య ప్రాంతంలో గొంతు నులిమి..
గుర్తుతెలియని మహిళ మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..
మాజీ ప్రియుడే హంతకుడిగా తేల్చిన దర్యాప్తు
Rs.5lakhs | గుంటూరు. ఆంధ్రప్రభ : దుగ్గిరాల పాత లాకుల వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన వెనుక దాగి ఉన్న దారుణాన్ని మంగళగిరి రూరల్, దుగ్గిరాల పోలీసులు ఛేదించారు. మొదట గుర్తుతెలియని మహిళగా నమోదైన ఈ కేసు… చివరికి ప్రేమ, మోసం, డబ్బు, ప్రతీకారం చుట్టూ తిరిగిన హత్యగా తేలింది. మాజీ ప్రియురాలినే పథకం ప్రకారం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలను వెల్లడించారు.
గుర్తుతెలియని మృతదేహంతో మొదలైన మిస్టరీ
దుగ్గిరాల పాత లాకుల సమీపంలో ఓ మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు… మహిళ మెడపై గాయాలు గుర్తించి, ఇది హత్యేనని నిర్ధారించి కేసు నమోదు చేశారు. మృతురాలి ఆచూకీ కోసం రాష్ట్రవ్యాప్తంగా లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో వెలుగులోకి సంచలన నిజాలు
సాంకేతిక ఆధారాలు, విచారణలో భాగంగా మృతురాలు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమాండ్యం ప్రాంతానికి చెందిన మీనాటి మేనకగా పోలీసులు గుర్తించారు. దర్యాప్తు మరింత లోతుగా సాగించగా… మేనకకు గుంటూరు జిల్లా వెళ్లబాడు గ్రామానికి చెందిన వల్లభాపురం చిరంజీవితో కొంతకాలంగా ప్రేమ సంబంధం ఉన్నట్లు తేలింది.
మరో పెళ్లి… మొదలైన విభేదాలు
ఇటీవల చిరంజీవి మరో మహిళను వివాహం చేసుకోవడంతో మేనక తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. చివరకు పెద్దల సమక్షంలో రాజీ కుదిరి… మేనకకు రూ.5 లక్షలు మూడు విడతల్లో నష్టపరిహారంగా చెల్లించాలని చిరంజీవికి సూచించినట్లు పోలీసులు తెలిపారు.
డబ్బుల పేరుతో పిలిచి… పథకం ప్రకారం హత్య
ఈ ఏడాది మే 29న తొలి విడత డబ్బులు తీసుకోవడానికి మేనక గుంటూరుకు వచ్చింది. అయితే అదే రోజు ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. అప్పటికే హత్యకు పథకం వేసుకున్న చిరంజీవి… మేనకను దుగ్గిరాల పాత లాకుల వద్దకు తీసుకెళ్లి, అక్కడే గొంతు నులిమి దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హత్య అనంతరం అక్కడి నుంచి పరారైన నిందితుడు… ఈ ఘటనను ప్రమాదంగా లేదా గుర్తుతెలియని మహిళ మృతిగా మిగిలిపోతుందని భావించినట్లు పోలీసులు తెలిపారు.
చివరకు పోలీసుల ఎదుట ఒప్పుకున్న నిందితుడు
సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, ఇతర కీలక సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా… చిరంజీవి నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.
ప్రేమతో మొదలైన బంధం… హత్యతో ముగిసింది
ఒకప్పుడు ప్రేమగా మొదలైన పరిచయం… విభేదాలకు దారి తీసింది. నష్టపరిహారం పేరుతో మొదలైన రాజీ ప్రయత్నం… చివరకు ఓ యువతి ప్రాణాలను బలిగొన్న విషాదంగా మారింది. గుర్తుతెలియని మహిళ మృతదేహంగా మొదలైన ఈ కేసును పోలీసులు ఛేదించి, హంతకుడిని చట్టం ముందు నిలబెట్టారు.
