ఓటరు జాబితా సవరణలో బీఎల్‌వోలకు చిరునామాల సమస్య

  • ఇళ్ల మార్పులతో ఫారాల పంపిణీలో ఇబ్బందులు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ఈ నెల 25 నుంచి ప్రారంభం కాగా, ఓటర్లకు ఎన్నుమరేషన్ ఫారాల పంపిణీలో బీఎల్‌వోలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వార్డ్ లెవెల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఫారాలను పంపిణీ చేస్తున్నారు.

అయితే గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న భూపాలపల్లి 2009లో నియోజకవర్గంగా ఏర్పడి, అనంతరం జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందడంతో అనేక కుటుంబాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్నాయి. దీంతో ఓటర్ల పేర్లు ఇప్పటికీ పాత పోలింగ్ కేంద్రాల్లోనే ఉండటం, నమోదు చేసిన చిరునామాలకు వారు అందుబాటులో లేకపోవడంతో ఫారాల పంపిణీ ఆలస్యమవుతోంది.

ఇక తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో నమోదై ఉందో తెలియక ప్రజలు కూడా అయోమయానికి గురవుతున్నారు. దీంతో బీఎల్‌వోలు స్థానికుల సహకారంతో ఓటర్లను గుర్తిస్తూ ఫారాల పంపిణీ చేపడుతున్నారు. అధికారులు మాత్రం ప్రతి అర్హ ఓటరికి ఎన్నుమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.