Rain Alert | తెలంగాణలో వానలే వానలు
పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్‌లోనూ ఈదురుగాలులతో వర్షాలు
ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశం
Rain Alert | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: తెలంగాణలో రానున్న ఏడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్షాల ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని పేర్కొంది.
రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ప్రస్తుతం సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్‌లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతంగా ఉన్నప్పటికీ, ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నగర ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని, వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అలాగే రానున్న రెండు గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, నల్గొండ, జనగామ, సిద్ధిపేట, వరంగల్ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమై ఆ తర్వాత మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వైపు మేఘాలు కదులుతున్నందున సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాల్లోనూ చెదురుమదురు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. యాదాద్రి-భువనగిరి, హనుమకొండ, వరంగల్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలవకూడదని, అవసరమైతే మాత్రమే ప్రయాణాలు చేయాలని అధికారులు సూచించారు.
