Hydraa Hasmathpet Land | ప్ర‌భుత్వ భూమికి విముక్తి

రూ.750 కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూమి పరిరక్షణ
ప్రీకాస్ట్ గోడలు, తాత్కాలిక షెడ్ల తొలగింపు.. రెవెన్యూ అధికారుల లేఖతో రంగంలోకి దిగిన హైడ్రా

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్‌పేటలో శనివారం హైడ్రా (HYDRAA) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. రెవెన్యూ శాఖ అధికారుల లేఖ ఆధారంగా చేపట్టిన ఈ చర్యల్లో దాదాపు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి విముక్తి చేశారు. మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి విలువ సుమారు రూ.750 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అధికారుల వివరాల ప్రకారం హస్మత్‌పేట సర్వే నంబర్–1లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే సుమారు 98 ఎకరాలు ఆక్రమణలకు గురై నివాస గృహాల నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ప్రజలు నివసిస్తున్న ఇళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మిగిలి ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిపైనే హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ భూమిలో ఆక్రమణదారులు ప్రీకాస్ట్ కాంపౌండ్ గోడలు నిర్మించి, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి భూమిని తమ ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు. కొంతమందిని కాపలాగా నియమించి ఆక్రమణలను కొనసాగిస్తున్నట్లు కూడా వెల్లడించారు.

పోలీసుల భారీ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారుల సమక్షంలో హైడ్రా సిబ్బంది ప్రీకాస్ట్ గోడలు, తాత్కాలిక షెడ్లను జేసీబీలతో తొలగించారు. ప్రభుత్వ భూములను కాపాడే చర్యల్లో భాగంగానే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌ని అధికారులు స్పష్టం చేశారు.