తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు..
సీఎంకు సలహాదారుగా రామకృష్ణారావు
13 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు
పలు కీలక శాఖల్లో బాధ్యతల మార్పు.. ఉన్నతస్థాయి పరిపాలనలో కీలక మార్పులు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. సబ్యసాచి ఘోష్‌కు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ శాఖ అదనపు బాధ్యతలు కేటాయించింది. శైలజా రామయ్యర్‌ను పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక (ఈఎఫ్‌ఎస్ అండ్ టీ) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది.
అహ్మద్ నదీమ్‌ను సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ విభాగం) ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించగా, ఎన్. శ్రీధర్‌కు ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. రాహుల్ బోజ్జాను విపత్తు నిర్వహణ శాఖ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది.
ఎం. రఘునందన్ రావుకు గనులు, భూగర్భ వనరుల (మైన్స్ అండ్ జియాలజీ) శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. అజిత్ రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈవో)గా బదిలీ చేసింది.
పి. కాత్యాయని దేవిని హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించగా, కె. గంగాధర్‌ను రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది.
అదేవిధంగా టి. వెంకన్నను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా నియమించింది. కె. విద్యాసాగర్‌ను తెలంగాణ పర్యాటక శాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ బదిలీలతో రాష్ట్ర పరిపాలనలో కీలక శాఖల్లో కొత్త బాధ్యతల పంపిణీ జరిగింది. ప్రభుత్వ పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే ఈ పరిపాలనా మార్పుల ప్రధాన ఉద్దేశంగా అధికారులు పేర్కొంటున్నారు.
