కుర్రాడి మీదే అంద‌రి క‌ళ్లు.. !!

  • 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. !?
  • ఐర్లాండ్‌లో చరిత్ర సృష్టించే ఛాన్స్!
  • ప్రమాదంలో సచిన్, రోహిత్ రికార్డులు..

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్-2026లో అద్భుత ప్రదర్శనతో భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా నిలిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అంతర్జాతీయ అరంగేట్రానికి అడుగు దూరంలో ఉన్నాడు. ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతడికి అవకాశం లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ తొలి మ్యాచ్‌లోనే టీమిండియా తరఫున బరిలోకి దిగితే వైభవ్ పేరిట పలు అరుదైన రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.

సచిన్ రికార్డు బద్దలయ్యే అవకాశం..

ప్రస్తుతం భారత తరఫున అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (16 సంవత్సరాలు 205 రోజులు) పేరిట‌ రికార్డు కొనసాగుతోంది. ఇటీవలే 15 ఏళ్లు పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్‌పై అరంగేట్రం చేస్తే ఈ ఘనతను అధిగమించి భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అంతర్జాతీయ ఆటగాడిగా నిలుస్తాడు.

అరంగేట్ర ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు?

భారత్ తరఫున టీ20 అరంగేట్ర ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ప్రస్తుతం ఇషాన్ కిషన్ పేరిట ఉంది. ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్‌లో ఇషాన్ నాలుగు సిక్సర్లు కొట్టాడు. వైభవ్ ఐర్లాండ్‌పై ఐదు సిక్సర్లు బాదితే ఈ రికార్డు అతని సొంతమవుతుంది.

టీ20 అరంగేట్రంలో అత్యధిక పరుగుల రికార్డు

భారత్ తరఫున టీ20 అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అజింక్య రహానే (61 పరుగులు) నిలిచాడు. వైభవ్ తన తొలి మ్యాచ్‌లో 62 పరుగులు చేస్తే కొత్త రికార్డు నెలకొల్పనున్నాడు.

ఐర్లాండ్ గడ్డపై మరో ప్రత్యేక రికార్డు..!

ఐర్లాండ్ వేదికగా టీ20ల్లో అరంగేట్రం చేసిన భారత ఆటగాళ్లలో ఇప్పటివరకు ఒక్క బ్యాటర్ కూడా తొలి మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవలేదు. సిద్ధార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్, ప్రసిద్ధ్ కృష్ణ, రింకూ సింగ్‌లు ఐర్లాండ్‌లోనే టీ20 అరంగేట్రం చేసినప్పటికీ, వారిలో ఎవరూ తమ తొలి మ్యాచ్‌లో పరుగులు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి అరంగేట్ర అవకాశం లభించి కనీసం ఒక్క పరుగు చేసినా, ఐర్లాండ్‌లో టీ20 అరంగేట్ర మ్యాచ్‌లో పరుగులు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు.

రోహిత్ రికార్డుపైనా కన్ను

ఐర్లాండ్ గడ్డపై టీ20ల్లో భారత ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ (97 పరుగులు) ఉన్నాడు. వైభవ్ అరంగేట్ర మ్యాచ్‌లోనే 98 పరుగులు చేస్తే రోహిత్ రికార్డును కూడా అధిగమించనున్నాడు. ఐపీఎల్‌లో తన ధాటైన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు టీమిండియా జెర్సీలో కూడా అదే జోరు కొనసాగిస్తాడా… అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.