బైక్‌ను తప్పించబోయి కల్వర్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ: బస్సు డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిన ఘటన గురువారం నల్లగొండ మండలంలో చోటుచేసుకుంది. ప్రయాణికులు, స్థానికులు, బస్సు డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం దోమలపల్లి పరిధిలోని మోటుబావిగూడెం వద్ద నల్లగొండ–మునుగోడు ప్రధాన రహదారిపై ఉన్న మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టుపైకి దూసుకెళ్లింది.

నల్లగొండ వైపు వెళ్తున్న బస్సు ఒక్కసారిగా కల్వర్టును ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం మరింత పెరగకుండా నిలువరించగలిగారు. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 70 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సంఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.