ఆదర్శ గ్రామీణ యోజన పనులను పరిశీలించిన జడ్పీ సీఈవో
- పెద్ద ముష్టూరులో అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి తనిఖీ
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: మండలంలోని పెద్ద ముష్టూరు గ్రామంలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా పరిషత్ సీఈవో విజయలక్ష్మి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన రెండో విడతలో భాగంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లు, సిమెంట్ మురుగు కాలువల పనులను ఆమె తనిఖీ చేశారు. పనుల నాణ్యత, పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ఆర్‌జీఎస్‌ఏ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.32 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవి ప్రసాద్, ఏపీవో సుజాత, గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు అషేర్ బాబు, రమణ కుమార్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ హరీష్, టీడీపీ నాయకుడు బోస్ పాల్గొన్నారు.
