జూన్ 29న చిలకలూరిపేటలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: “ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29న చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు “ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” కార్యక్రమాన్ని ఈ నెల చిలకలూరిపేట నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి నేరుగా అర్జీలు, వినతులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు, వినతులను అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోరారు. అలాగే, నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు.