దేవలమ్మ నాగారంలో ఉచిత స్కూల్ బస్సు ప్రారంభం..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండల పరిధిలోని దేవలమ్మ నాగారం గ్రామ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన ఉచిత స్కూల్ బస్సును గురువారం ఘనంగా ప్రారంభించారు. గ్రామానికి చెందిన దివంగత ఏనుగు జంగా రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు, ప్రముఖ దాత ఏనుగు శ్రీనివాస్ రెడ్డి-సరిత దంపతులు విద్యార్థుల రవాణా కోసం ఈ బస్సును ఉచితంగా అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చౌటుప్పల్ సీఐ జి. మన్మథ్ కుమార్, స్థానిక సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్, మండల విద్యాధికారి (ఎంఈఓ) గురువారావు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి బస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, సొంత గ్రామంలోని విద్యార్థులు చదువు కోసం రవాణా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలనే ఉద్దేశంతో లక్షల రూపాయల విలువైన బస్సును విరాళంగా ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. తండ్రి జ్ఞాపకార్థం చేసిన ఈ సేవ ఇతరులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, విద్యార్థులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.