నీటి తొట్టిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి..

చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది.

గ్రామస్తుల కథనం ప్రకారం, తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కంచు మౌనిక–బీరన్న దంపతుల కుమార్తె అన్వి (2) తన తోటి పిల్లలతో ఆడుకుంటూ పక్కింటిలో ఉన్న నీటి తొట్టిలో ప్రమాదవశాత్తు పడిపోయింది.

కొంతసేపటి తర్వాత గుర్తించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చిన్నారిని బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.