ఇంటింటికీ రానున్న బీఎల్ఓలు
- చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
- సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్ విడుదల చేసిన తహశీల్దార్ వీరాబా
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘ప్రత్యేక ఓటర్ల జాబితా తీవ్ర సవరణ’ (Special Intensive Revision – SIR 2026) కార్యక్రమం చౌటుప్పల్ మండలంలో గురువారం (జూన్ 25) నుండి అధికారికంగా ప్రారంభమైంది. జూన్ 25 నుండి జూలై 24 వరకు నెల రోజుల పాటు ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగనుంది.
ఈ సందర్భంగా చౌటుప్పల్ మండల తహశీల్దార్ వీరాబాయి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. మండల పరిధిలోని బూత్ స్థాయి అధికారులు (BLO) నిర్దేశిత గడువులోగా ప్రతి ఇంటినీ సందర్శిస్తారని తెలిపారు. బీఎల్ఓలు నేరుగా ఓటర్ల ఇళ్లకు వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలనుకునే వారు, ఓటర్ల జాబితాలో సవరణలు (పేరు, వయస్సు, చిరునామా తదితర మార్పులు) చేయించుకోవాలనుకునే వారికి ఈ సవరణ ప్రక్రియ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
అందుబాటులో హెల్ప్ డెస్క్..

ఓటర్ల జాబితా సవరణ, ఎన్యూమరేషన్ ప్రక్రియపై చౌటుప్పల్ మండల ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేసేందుకు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లుగా తహశీల్దార్ వీరాబాయి వెల్లడించారు. ప్రజలు తమ సందేహాల కోసం నేరుగా కార్యాలయానికి రావచ్చునని, లేదా కార్యాలయ హెల్ప్‌లైన్ మొబైల్ నంబర్ 9959560261 కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ స్థాయిలో కేటాయించిన టోల్ ఫ్రీ నంబర్ 1950 ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చని ఆమె స్పష్టం చేశారు. మండల ప్రజలందరూ బాధ్యతగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహశీల్దార్ వీరాబాయి పిలుపునిచ్చారు.
