మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థుల పాత్ర కీలకం

  • పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : మాదక ద్రవ్యాల మహమ్మారిని పూర్తిగా నిర్మూలించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కమ్మర్ పల్లి ఎస్ఐ సిహెచ్. సతీష్ పిలుపునిచ్చారు.గురువారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో కలిసి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బస్టాండ్ వరకు ప్లకార్డులను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి యువతలో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృతమైన అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ సిపి పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాలు వద్దు.. బంగారు భవిష్యత్తు ముద్దు,డ్రగ్స్ రహిత సమాజం.. మనందరి బాధ్యత,మత్తు మనిషిని, సమాజాన్ని నాశనం చేస్తుంది అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మానవహారంగా ఏర్పడిన విద్యార్థులందరితో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని,తమ జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ వాటికి చోటు ఇవ్వబోమని,సమాజంలో డ్రగ్స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైతన్యవంతులుగా వ్యవహరిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులు కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తామని సంకల్పం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల మరియు పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు,ఏఎస్ఐ వెంకట్ సాయి,సిబ్బంది లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.