Amazon CEO | 2030 నాటికి 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులు….
- ప్రధాని మోదీని కలిసిన అమెజాన్ సీఈఓ..
- ఏఐ, క్లౌడ్ మౌలిక వసతుల విస్తరణపై ప్రత్యేక దృష్టి
- యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రధాని వెల్లడి
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ప్రపంచ దిగ్గజ ఈ-కామర్స్, టెక్నాలజీ సంస్థ అమెజాన్ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన అనంతరం ఈ ప్రకటన చేశారు. 2026 నుంచి 2030 మధ్య భారత్‌లో మొత్తం 48 బిలియన్ డాలర్లు (సుమారు రూ.4 లక్షల కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే 2010 నుంచి భారత్‌లో అమెజాన్ సుమారు 40 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిందని, గతంలో ప్రకటించిన 35 బిలియన్ డాలర్ల పెట్టుబడిని తాజాగా 48 బిలియన్ డాలర్లకు పెంచినట్లు ఆండీ జెస్సీ తెలిపారు. ఇందులో అదనంగా 13 బిలియన్ డాలర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించనున్నట్లు చెప్పారు.
ఈ పెట్టుబడుల్లో ప్రధాన భాగాన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ద్వారా ముంబై, హైదరాబాద్‌లలో డేటా సెంటర్ల విస్తరణకు వినియోగించనున్నారు. భారత్ ప్రపంచ స్థాయి ఏఐ, క్లౌడ్ హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెస్సీ వెల్లడించారు.
ప్రధానమంత్రి మోదీతో భేటీ అనంతరం ఆండీ జెస్సీ మాట్లాడుతూ… గత 12 ఏళ్లలో భారత్ డిజిటల్ రంగంలో సాధించిన అభివృద్ధి విశేషమని కొనియాడారు. ప్రధానమంత్రి మోదీ దూరదృష్టి నాయకత్వం వల్లే భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదుగుతోందని ప్రశంసించారు.
ఈ భేటీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. అమెజాన్ ప్రకటించిన రికార్డు స్థాయి 48 బిలియన్ డాలర్ల పెట్టుబడిని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పెట్టుబడులతో భారత యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ప్రపంచ పెట్టుబడిదారులకు భారత్‌పై పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని తెలిపారు.
2030 నాటికి భారత్‌లో 38 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పించాలని అమెజాన్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిపింది. అలాగే 80 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ ఎగుమతులను ప్రోత్సహించడం, 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు ఏఐ ఆధారిత సేవలు అందించడం, సుమారు 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ విద్య అందించాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది.
