ఎస్ఐఆర్ 80 శాతం పూర్తి
ఎస్ఐఆర్ 80 శాతం పూర్తి
కలెక్టర్ వినోద్ కుమార్
బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ 80 శాతం పూర్తయిందని, ఈ నెల 27 నాటికి వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియ 71 శాతం పూర్తయిందన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ఓటరు వివరాల నమోదు పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం రైతన్న వారోత్సవాల నిర్వహణపై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతును వ్యక్తిగతంగా కలుసుకుని పంటల వివరాలు నమోదు చేయాలని, పీఎం కిసాన్ పథకంలో అర్హులైన రైతుల నమోదు వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో జి. గంగాధర్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
